నేటి నుంచి తిరుమలలో కొత్త నిబందన అమలులోకి వచ్చింది అయితే ఇది సామాన్య భక్తులకు వర్తించదు! అదేమిటంటే, ఇకపై తిరుమల కొండపై, ముఖ్యంగా ఆలయ ఆవరణలో రాజకీయ నాయకులు ఎవరూ విలేఖరులతో రాజకీయాలు, రాజకీయ విద్వేష పూరిత మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా ఈ నిబందన ఉల్లంఘిస్తే, టీటీడీ నిబందనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసి ఆమోదించింది.
ఇది చాలా మంచి నిర్ణయమే. కానీ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే రాజకీయ ప్రముఖులపై టీటీడీ చర్యలు తీసుకునే సాహసం చేయగలదా?ఉదాహరణకు ఏపీ లేదా తెలంగాణ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రులు లేదా మంత్రులో వచ్చి విలేఖరులతో మాట్లాడితే వారిపై టీటీడీ ఏమైనా చర్యలు తీసుకోగలదా? అంటే కాదనే అర్దమవుతోంది.
కనుక వారిపై ఆంక్షలు విధించి వాటిని అమలు చేయలేక టీటీడీ నవ్వులపాలు కావడం కంటే, తిరుమల కొండపైకి విలేఖరులను అనుమతించకపోతే సరిపోతుంది కదా?
రాజకీయ నాయకులు లేదా ప్రముఖులు మాట్లాడేందుకు తిరుమల కొండ దిగువన ఏదైనా టీటీడీ కాటేజీ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేసి అక్కడే మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది కదా?