తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గత ఏడాది కాలంగా ఫ్లోరిడాలో తన కుమారుడు వద్ద ఉంటున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు తాను ఎటువంటి తప్పు చేయలేదని త్వరలో వచ్చి విచారణకు హాజరవుతానని విచారణాధికారులకు ఈ మెయిల్ కూడా పంపారు. కానీ ఇంత వరకు రాలేదు.
ఆ తర్వాత తన అరెస్టుకి రంగం సిద్దమవుతోందని తెలిసినప్పుడు ఆరోగ్య కారణాలతో ఎప్పుడు తిరిగివస్తానో చెప్పలేనన్నారు. అంటే అరెస్ట్ భయంతోనే ఆయన అమెరికాలో ఉండిపోతున్నారన్న మాట! కనుక పోలీసులు ఆయన పేరిట రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఇంటర్ పోల్ ద్వారా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే అరెస్ట్ తప్పదని పసిగట్టిన ప్రభాకర్ రావు, ‘తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించి ఆశ్రయం కల్పించాలని’ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
తాను తెలంగాణ ప్రభుత్వంలో చాలా కీలక పదవిలో పనిచేశానని, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రాజకీయ కక్షతో తనను ఫోన్ టాపింగ్ కేసులో ఇరికించి జైల్లో పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రభాకర్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా తాను తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ అమెరికాలో చికిత్సలు తీసుకుంటున్నానని, కనుక తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించి ఆశ్రయం ఇవ్వాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.
ఇప్పటికే ఆయనకు అమెరికాలో శాశ్విత పౌరసత్వం కల్పించే ‘గ్రీన్ కార్డు’ ఉంది. కనుక ఆయన అమెరికా పౌరుడిగానే పరిగణింపబడతారు. కనుక రాజకీయ ఆశ్రయం కోరుతూ ఆయన దరఖాస్తుని అమెరికా ప్రభుత్వం ఆమోదించిన్నట్లయితే, తెలంగాణ పోలీసులు ఆయనను ఎట్టి పరిస్థితులలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తిరిగి తీసుకురాలేరు.
ఆయనను తీసుకురాలేకపోతే ఫోన్ టాపింగ్ కేసు విచారణ ముందుకు సాగడం కష్టమే. ఈ కేసులో ఇంతవరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు అందరూ తాము కేసీఆర్ ఆదేశం మేరకే ఫోన్ టాపింగ్, పోలీసు వాహనాలలో అక్రమంగా డబ్బు తరలిస్తుండేవారిమని చెప్పారు. కనుక ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయలేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో కేసీఆర్‌ని టచ్ చేయలేకపోవచ్చు.