నయనతారపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ కేసు

November 27, 2024


img

నయనతార జీవిత విశేషాలను తెలియజేస్తూ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారం అవుతోంది. దానిలో తన అనుమతి లేకుండా ‘నానుం రౌడీ డాన్’ అనే సినిమా నుంచి 3 సెకన్లు నిడివి గల క్లిప్పింగ్ వాడుకునందుకు ఆ సినిమా నిర్మాత ధనుష్ వారిపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. 

నయనతార విగ్ణేష్ శివన్ని పెళ్ళి చేసుకోక మునుపు ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి 2015 లో ఆ సినిమా చేశారు. ఆమె కెరీర్‌లో ఆ సినిమా ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. కనుక తన జీవిత విశేషాలలో దాని గురించి కూడా చెప్పుకుందామని  నయనతార అనుకున్నారు. 

ఆ సినిమా క్లిప్పింగ్స్, కనీసం పాటలు వాడుకునేందుకు తమని అనుమతించాలని ఆమె చాలాసార్లు ధనుష్ని అభ్యర్ధించారు. కానీ ఆ సినిమా వల్లనే తమకు అంత పేరు ప్రతిష్టలు వచ్చాయనే అసూయతో ధనుష్ అనుమతించలేదని ఆరోపిస్తూ నయనతార పెద్ద లేఖ కూడా వ్రాశారు. 

కానీ తన డాక్యుమెంటరీలో ఆ సినిమా ప్రస్తావన కూడా ఉండాలనుకున్నందున దానిలో 3 సెకన్లు మాత్రమే నిడివి గల చిన్న క్లిప్పింగ్ వాడుకున్నారు. 

అందుకు రూ.10 కోట్లు చెల్లించాలని లేకుంటే కోర్టులో కేసు వేస్తానని ధనుష్ హెచ్చరించారు. కానీ నయనతార దంపతులు ఆ సొమ్ము చెల్లించేందుకు నిరాకరించడంతో ధనుష్ మద్రాస్ హైకోర్టులో వారిరువురిపై, వారి సినీ నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’పై కేసు వేశారు. 

చట్ట ప్రకారం కాపీ రైట్ హక్కులు ధనుష్కే   ఉన్నాయి కనుక తాము జరిమానా చెల్లించాల్సి రావచ్చని, కానీ పైన భగవంతుడి న్యాయస్థానంలో ధనుష్ తప్పించుకోలేడని నయనతార ముందే చెప్పారు. 

కనుక మద్రాస్ హైకోర్టు వారిని మందలించి విడిచిపెడుతుందా లేదా ఏమైనా జరిమానా విధిస్తుందా అనేది త్వరలోనే తెలుస్తుంది.


Related Post