సోషల్ మీడియా గురించి వర్మ విశ్లేషణ భలే ఉందే!

November 27, 2024


img

ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం గాలిస్తుండటం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి వీడియోలు పోస్ట్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్, ఊహాగానాలపై వర్మ స్పందిస్తూ మరో వీడియో పోస్ట్ చేశారు. దానిలో ఆయన తన గురించి చెప్పుకున్నదాని కంటే సోషల్ మీడియా గురించి చేసిన విశ్లేషణ చాలా బాగుంది. 

“సోషల్ మీడియాకి ఎవరైనా ఎందుకు వస్తారంటే ఇటువంటి గాసిప్స్ కోసమే. అవి వారికి వినోదం కలిగిస్తాయని నాకు తెలుసు. కనుక నా గురించి ఏం చెప్పుకున్నా నేను అర్దం చేసుకోగలను. అందుకు నేను పెద్దగా బాధపడను కూడా. 

కానీ సోషల్ మీడియాలో వస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు, విమర్శలను సీరియస్‌గా తీసుకొని వాటి వలన ఎవరివో మనోభావాలు దెబ్బ తింటున్నాయని కేసులు పెట్టుకుంటూ పోతే సోషల్ మీడియాలో 80-90 శాతం మందిపై కేసులు పెట్టాల్సివస్తుంది. ఇది సోషల్ మీడియా ప్రాబ్లెం తప్ప నాది కాదు. ఈ చిన్న పాయింట్ అందరూ అర్దం చేసుకుంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

సెలబ్రెటీలను సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ చేస్తుంటారు. వాటిని చాలా వరకు పట్టించుకోరు. కానీ సహనం నశించినప్పుడు కేసులు పెడుతుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయ్యే సెలబ్రెటీలలో వర్మ కూడా ఒకరు. కనుక ఆయన కూడా ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు.

కానీ ఓ సెలబ్రెటీగా ఉన్న వర్మ మరో సెలబ్రెటీని అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ట్రోల్ చేశారు కనుకనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో చాలా మంది ఎలా హద్దులు దాటుతారో, వర్మ కూడా వారిరువురి విషయంలో అలాగే హద్దులు దాటేశారు. 

కనుకనే ఇప్పుడు వారు ఆయనపై చర్యలకు ఉపక్రమించారని అర్దమవుతూనే ఉంది. కానీ చేతులు కాలక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు కనుక వర్మ ఇప్పుడు ఎంత తెలివిగా వాదించినా నిరూపయోగమే కదా?            



Related Post