బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆదివారం హుజూరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ నెల 9న హుజూరాబాద్ చౌరస్తాలో జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా నిర్వహించారు.
అప్పుడే పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకుని వ్యానులో పోలీస్ స్టేషనుకి తరలించే ప్రయత్నించగా వారితో ఆయన వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. కనుక ముందస్తు అనుమతి తీసుకోకుండా జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు, పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకుగాను బీఎన్ఎస్ సెక్షన్ 35 (3) ప్రకారం పోలీసులు ఆయనకు నోటీసు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో చాలా చురుకుగా ఉన్న అతికొద్ది మంది నేతలలో పాడి కౌశిక్ రెడ్డి ఒకరు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన దూకుడుకి కళ్ళెం వేయాలనుకోవడం సహజం.
సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా ఈవిదంగా అవకాశం కల్పించారని చెప్పొచ్చు. ఈ కేసులో పోలీసులు ఆయన విచారణకు హాజరుకాకపోతే పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంటుంది.