ఓ మోస్తరు వర్షం పడినా హైదరాబాద్ నగరంలో రోడ్లు నీట మునుగుతుంటాయి. అదే భారీ వర్షాలు కురిసిననట్లయితే నగరంలో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయి చెరువుల్లా మారిపోతాయి. ఆ కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంటే ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకి జీహెచ్ఎంసీ ఓ చక్కటి పరిష్కారం కనుగొంది.
నగరంలో వరద నీరు ఎక్కువగా నిలిచిపోతున్న కూడళ్ళని గుర్తించి అక్కడ భారీ సంపులు నిర్మిస్తోంది. అప్పుడు వరద నీరు నేరుగా వాటిలోకి వెళ్ళిపోతుంటుంది. ఒకవేళ ఆ సంపులు కూడా వరద నీటితో నిండిపోతే, వాటి నుంచి కాలువలలోకి నీళ్ళు మళ్లించేందుకు లోపల పంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణం కోసం రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆరు జోన్లలో ఒక్కో జోన్లో 5 చొప్పున సంపులు నిర్మించాలని నిర్ణయించారు.
ముందుగా నగరంలో వరద నీటి సమస్య ఎక్కువగా ఉన్న 14 ప్రాంతాలను గుర్తించి వాటిలో నాలుగు చోట్ల సంపులు నిర్మించారు. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో కురిసిన సగటు వర్షపాతం, రోడ్ల వెడల్పు వగైరా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా భారీ సంపులని జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది.
ఇది సత్ఫలితాలు ఇస్తే వీటిలో ఎదురయ్యే సమస్యలను అన్నిటినీ పరిశీలించిన తర్వాత నగరంలో మరో 140 సంపులు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.