బిఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో షాక్... ఊహించిందే!

November 22, 2024


img

బిఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

స్పీకర్‌ పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. దీనిపై రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవలసిందిగా ఆయనకు సూచించగలము తప్ప నిర్ధిష్ట కాలపరిమితిలో నిర్ణయం తీసుకోవాలని కూడా న్యాయస్థానం స్పీకర్‌ని ఆదేశించలేదని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, శాసనసభ 5 ఏళ్ళ కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని స్పీకర్‌ దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

కాంగ్రెస్‌లో ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే దానిని సద్వినియోగం చేసుకోవచ్చని బిఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ శాసనసభ స్పీకర్‌ పరిధిలో ఉన్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదనే విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ఈ ప్రయత్నం చేసి భంగపడింది.

మొదట హైకోర్టు సింగిల్ జడ్జి బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు చెప్పారు. నాలుగు వారాలలోగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించారు. శాసనసభ కార్యదర్శి ఆ తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనంలో పిటిషన్‌ వేశారు. దానిపై నేడు హైకోర్టు ఈవిదంగా తుది తీర్పు ఇచ్చింది. ఇది ముందే ఊహించిందే. కానీ బిఆర్ఎస్ పార్టీ కొండకు వెంట్రుక మూడేసి లాగే ప్రయత్నం చేసిందని సరిపెట్టుకోవాలి అంతే!


Related Post