లెంపలు వేసుకుంటున్నా.... రాజా!

November 22, 2024


img

ఏపీ దేనికి ప్రసిద్ధి? అంటే రాజకీయాలకు కూడా అని చెప్పుకోక తప్పదు. అలాగని తెలంగాణ లేదా మరో రాష్ట్రంలో రాజకీయాలు జరుగడం లేదా? అంటే జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మించి ఏపీలో రాజకీయాలు సాగుతుంటాయి.

గత 5 ఏళ్ళ జగన్‌ పాలనలోనే ఈ మార్పు మొదలైందని చెప్పవచ్చు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత ద్వేషంతో రగిలిపోతున్న జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయనపై కక్షసాధింపు చర్యలు మొదలుపెట్టారు.

చంద్రబాబు నాయుడు పట్ల జగన్‌ ద్వేషం ఏ స్థాయిలో ఉందంటే ఆయన మొదలుపెట్టిన అమరావతిని కూడా పాడుబెట్టెసే అంత. ఆ తర్వాత ఏపీలో టిడిపిని పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు, ఆ పార్టీ నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం మొదలు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపడం వరకు జగన్‌ చేయని ప్రయత్నాలు లేవు. 

అప్పటికీ జగన్‌కు సంతృప్తి కలగకపోవడంతో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, చివరికి పోసాని కృష్ణ మురళి, రాంగోపాల్ వర్మల చేత కూడా తిట్టించారు. వర్మ చేత ‘వ్యూహం’ వంటి సినిమాలు కూడా తీయించారు. 

ఎప్పటికీ జగన్మోహన్‌ రెడ్డే అధికారంలో ఉంటారనే గుడ్డి నమ్మకంతో ఆయనని  మెప్పించేందుకు వారందరూ రెచ్చిపోయి పోటీలుపడుతూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముగ్గురినీ, రాజకీయాలతో సంబంధమే లేని వారి ఇంట్లో ఆడవాళ్ళపై కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

కానీ ఎన్నికలలో వైసీపి ఓడిపోయింది. జగన్‌ అధికారం కోల్పోయారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముగ్గురూ అధికారంలోకి వచ్చారు. 

ఆనాడు జగన్‌ అండ చూసుకొని రెచ్చిపోయిన పోసాని, వర్మ, శ్రీరెడ్డి తదితరులు అందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. వర్మకి ఇప్పటికే పోలీసులు నోటీస్‌ ఇవ్వడంతో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. విచారణ పేరుతో తనపై ‘ధర్డ్ డిగ్రీ’ప్రయోగిస్తారని భయపడుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ నవంబర్‌ 28కి వాయిదా పడింది. 

ఇప్పటికే శ్రీరెడ్డి తనను క్షమించి విడిచిపెట్టమంటూ చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను వేడుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. 

తాజాగా పోసాని కూడా ఓ వీడియో పెట్టారు. దానిలో తాను ఇకపై జీవితంలో రాజకీయాల జోలికి రానని క్షమించి వదిలేస్తే తీర్ధయాత్రలు చేసుకుంటూ శేషాజీవితం గడిపేస్తానని విన్నవించుకున్నారు.

రాజకీయాలను వ్యక్తిగత స్థాయికి తీసుకువెళితే ఏమవుతుందో గ్రహించేందుకు ఇవే నిదర్శనాలు. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదేవిదంగా రాజకీయాలు సాగుతున్నాయి. కనుక భవిష్యత్‌లో తెలంగాణ రాజకీయాలలో కూడా ఇటువంటి పరిణామాలే జరిగినా ఆశ్చర్యం లేదు. 

(Video Courtecy: Daily Culture)


Related Post