ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో రెండు రాష్ట్రాలలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ.. హైదరాబాద్ ఇప్పటికే అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధించింది. కనుక అవి చూపించి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సులువు. కానీ ఈ విషయంలో పెద్దగా శ్రద్ద చూపుతున్నట్లు కనపడదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిలో రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు సాధించగలిగింది?అని ప్రశ్నించుకోవలసిన తరుణం ఇది.
ఎందువల్ల అంటే, ఏపీలో 5 ఏళ్ళ జగన్ అరాచక పాలనలో అన్ని రంగాలలో వెనుకబడింది. ముఖ్యంగా ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నందున ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించరు. కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్న బ్రాండ్ ఇమేజ్, పరిచయాలు, ఎన్డీయేలో కీలకంగా మారడం, ఏపీకి పరిశ్రమలు తెచ్చుకోవాలనే తపన కారణంగా ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు ప్రవాహంలా తరలి వస్తున్నాయి.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది పూర్తికాగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడే ఇంకా 5వ నెలలో అడుగుపెట్టింది. కానీ కేవలం ఈ 5 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ఏపీకి సాధించిన పెట్టుబడులు ఎంతంటే రూ.2.50 లక్షల కోట్లు! ఇవన్నీ కాకిలెక్కలు అని తీసి పారేయడానికి లేదు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అధ్వర్యంలో విశాఖపట్నం సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. ప్రధాని మోడీ ఈనెల 29న దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు. సుమారు 1600 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న ఈ ప్లాంట్ పెట్టుబడి రూ.1,85,000 కోట్లు! కనుక నమ్మి తీరాల్సిందే!
నెల్లూరు జిల్లా రామాయంపట్నంలో బీపీసీఎల్ రూ.65,000 కోట్ల పెట్టుబడితో 1600 ఎకరాలలో రిఫైనరీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది.
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీలు కలిసి రూ.61,780 కోట్లు పెట్టుబడితో స్టీల్ ప్లాంట్, కొత్తగా ఒక పోర్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాయి. దీనికి ఏపీ ప్రభుత్వం 800 ఎకరాలు కేటాయించింది కూడా.
ఇవికాక టాటా పవర్, రిలయన్స్ ఎనర్జీ, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్‌కో ఇంటిగ్రేటడ్ ఎనర్జీ తదిర 10 కంపెనీలు ఏపీలో రూ. 85,083 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.
తీవ్ర ప్రతికూల పరిస్థితులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇంత వేగంగా దూసుకుపోతుంటే, వడ్డించిన విస్తరిలా ఉన్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించడంలో ఎందుకు వెనకబడిపోతోంది?
ముఖ్యంగా 74 ఏళ్ళ వయసులో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఏపీకి ఇన్ని సాధించగలిగినప్పుడు, యువకుడైన సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు సాధించలేరు?అని ఆలోచించుకొని, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.