బిఆర్ఎస్ పార్టీ మహబూబాద్ జిల్లా మానుకోటలో సుమారు 50 వేలమందితో ధర్నా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. మానుకోటలో కర్ఫ్యూ విధించి పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీనిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. “ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? అక్కడ గొడవలు ఏం జరగలేదు? మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన ఖబర్దార్ రేవంత్ ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది,” అని ట్వీట్ చేస్తూ పోలీసు కవాతు వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉద్యమకారుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఎంత నిరంకుశంగా వ్యవహరించేవారో, ప్రతిపక్షాలతో తన ప్రభుత్వానికి ప్రమాదం ఉందంటూ వాటిని ఏవిదంగా నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారో అందరి కంటే కేటీఆర్‌కే బాగా తెలుసు.
టిజిఎస్‌ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ వారితో ఎంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారో, ఆ సమ్మె సమయంలో ఎంత మంది కార్మికులు చనిపోయారో, ఆత్మహత్యలు చేసుకున్నారో అందరికీ తెలుసు. అయినా కేటీఆర్‌తో సహా ఎవరికీ తప్పుగా అనిపించలేదు. ఒకవేళ అనిపించినా కేసీఆర్‌కి ఎదురుచెప్పలేక మౌనంగా ఉండిపోయారు.
ఆనాడు నా మాటే శాసనం అన్నట్లు పాలన సాగిస్తున్న కేసీఆర్, ప్రతిపక్షనేతలు తమ ఇళ్ళలో కూర్చొని నిరాహార దీక్షలు చేసుకుంటున్నా విడిచిపెట్టకుండా పోలీసులతో తలుపులు పగులగొట్టించి మరీ అరెస్టులు చేయించేవారు. అవన్నీ కేటీఆర్ మరిచిపోయిన్నట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరంకుశ రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది.
నిరంకుశత్వం ప్రదర్శిస్తే ప్రజలు తిరగబడతారని సిఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్న కేటీఆర్‌కి తమ పార్టీని, ప్రభుత్వాన్ని సరిగ్గా అందుకే ప్రజలు గద్దె దించేశారని ఒప్పుకుని ఈ మాట చెపితే బాగుండేది.