ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో నోటీస్ అందుకున్న బిఆర్ఎస్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ని ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు రెండు గంటల సేపు విచారణ జరిపిన తర్వాత మళ్ళీ అవసరమైతే రావలసి ఉంటుందని చెప్పి పంపేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. నేను రెండు కుటుంబాల మద్య ఓ ప్రైవేట్ వివాదం విషయంలో తిరుపతన్నని కలిసిన మాట నిజం, ఆయన కూడా మా సామాజిక వర్గానికి చెందినవారేననే ఉద్దేశ్యంతో ఆయన సాయం తీసుకోవాలని కలిశాను. ఆ సందర్భంగా ఆయనకు ఆ రెండు కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు ఇచ్చాను. అవి ట్యాపింగ్ అయ్యాయనే సంగతి నాకు తెలీదు.
నేను కేవలం ఆ వివాదం పరిష్కారం కోసమే తిరుపతన్నని కలిశాను. ఈరోజు విచారణలో పోలీసులు కొన్ని సాక్ష్యాధారాలు చూపించి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ నేను సమాధానాలు చెప్పాను. అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. అందుకు నేను అంగీకరించాను. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా వచ్చి పోలీసులకు సహకరిస్తాను,” అని జైపాల్ యాదవ్ చెప్పారు.