డబ్బులు వేస్తామని ఫోన్‌ వచ్చిందా? అయితే జాగ్రత్త!

November 16, 2024


img

మీకు ఎవరైనా ఫోన్‌ చేసి మీ అకౌంట్‌లో డబ్బులు వేస్తామని చెపుతున్నారా?కానీ ఆశ పడకండి. పడితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది.. జాగ్రత్త! ఇదో కొత్త రకం సైబర్ నేరం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. 

బంజారాహిల్స్‌లో ఓ గృహిణికి ఓ అపరిచుతుడు ఫోన్‌ చేసి, మీరు ఫలానా వ్యక్తి కుమార్తె కదూ?మీ పేరు ఫలానా కదూ? అంటూ ఆప్యాయంగా పలకరించి, “నేను మీ తండ్రిగారి నుంచి ఇదివరకు ఎప్పుడో రూ.2,000 అప్పు తీసుకున్నాను. తిరిగి ఇచ్చేద్దామంటే ఆయన ఫోన్‌ నంబర్‌ లేదు. కానీ ఇదివరకు ఎప్పుడో ఆయన మీ పేరు, నంబర్‌ చెపితే నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను.

మీ తండ్రిగారి నంబర్‌ కోసం వెతుకుతుంటే మీ ఫోన్‌ నంబర్‌ కనబడి మీకు ఫోన్‌ చేస్తున్నాను. ఇప్పుడే మీకు గూగుల్ పే ద్వారా ఆ డబ్బు పంపిస్తున్నాను. డబ్బు తిరిగి చెల్లించడంలో ఆలస్యం అయినందుకు ఏమనుకోవద్దని మీ నాన్నగారికి చెప్పండి,” అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు అవతలి వ్యక్తి. 

ఆ తర్వాత ఆమె ఫోన్‌కు వరుసగా రూ. 10,000 మళ్ళీ రూ.12,000, మళ్ళీ మరో రూ.20,000 పంపిన్నట్లు మెసేజులు వచ్చాయి. వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోతుండగానే మళ్ళీ ఆ వ్యక్తి ఫోన్‌ చేసి, “అమ్మా నేనే... వేరెవరికో డబ్బు పంపించబోయి మీ అకౌంట్‌లో రూ.40,000 వేసేశాను. దయచేసి మీ రూ.2,000 మినహాయించుకొని మిగిలిన రూ.38,000 తిరిగి పంపించండి. లేకుంటే నాకు చాలా ఇబ్బందవుతుంది,” అని చెప్పాడు. 

రూ.40,000 పడిన్నట్లు తన ఫోన్‌లో మెసేజ్‌లు వచ్చాయి కనుక ఆమెకు అనుమానం కలుగలేదు. వెంటనే రూ.38,000 తిరిగి పంపించేసింది. వెంటనే బ్యాంక్ ఖాతాలో ‘జీరో బ్యాలన్స్’ ఉందంటూ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. 

అది చూసి ఆమె షాక్ అయ్యి భర్తకు చెప్పింది. తాము మోసపోయామని గ్రహించిన అతను వెంటనే బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి విషయం చెప్పి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సదరు సైబర్ నేరగాడి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. 

ఇటువంటి సైబర్ మోసానికి గురైనవారు గంటలోపుగా వచ్చి ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ముని వెనక్కు రాబట్టవచ్చని చెప్పారు. దీనినే ‘గోల్డెన్ హవర్’అని సైబర్ పోలీసు చెపుతుంటారు. సైబర్ నేరగాడు ఆ మహిళ వద్ద నుంచి కాజేసిన రూ.38,000 తప్పకుండా వెనక్కు వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుందని బంజారాహిల్స్‌ ఎస్సై రాఘవేందర్ చెప్పారు. 

ఈవిదంగా ఎవరైనా మీ అకౌంట్‌లో డబ్బులు  వేస్తామని ఫోన్‌ చేస్తే నమ్మవద్దని, నమ్మితే ఇలాగే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుందని చెప్పారు. కనుక ప్రజలందరూ ఈ కొత్తరకం సైబర్ మోసం గుర్తించి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

అలాగే ఎవరైనా ‘క్యూఆర్ కోడ్’ పంపితే పొరపాటున కూడా దానిని స్కాన్ చేయవద్దు. దానికి డబ్బులు పంపకూడదు. చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఓఎల్ఎక్స్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మాలనుకునేవారు, కొనాలనుకునేవారు ఈవిదంగా కూడా మోసపోతున్నారు. 


Related Post