వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల కోసం లగచర్లలో భూసమీకరణకి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఈ సందర్భంగా జరిగిన దాడి, కేసులు, అరెస్టులు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండూ ఆత్మరక్షణలో పడినా ఎదురుదాడి చేస్తుండటం విశేషం.
భూసమీకరణని లగచర్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో మల్లన్నసాగర్ భూసేకరణలో బిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ చేయొద్దని వామపక్షాలు హెచ్చరిసున్నాయి కూడా. కానీ కధ ఇంతవరకు వచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కు తగ్గితే బిఆర్ఎస్ పార్టీ వాదనలు నిజమని అంగీకరించిన్నట్లవుతుంది. ఇప్పటికే హైడ్రా కూల్చేవేతలు, మూసీవాసులను ఇళ్ళు ఖాళీ చేయిస్తుండటంతో సామాన్య ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు లగచర్లలో భూసేకరణకు పూనుకోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన్నట్లే భావించవచ్చు.
మరోపక్క లగచర్ల దాడి వెనుక బిఆర్ఎస్ పార్టీకి చెందిన సురేష్ తదితరులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేటీఆర్ సైతం దానిని ధృవీకరిస్తున్నట్లు మాట్లాడి దొరికిపోయారు. ముఖ్యంగా అధికారులపై దాడిని నేటికీ కేటీఆర్ ఖండించకపోవడంతో ఆ దాడిలో బిఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉందని ప్రజలు భావించేలా చేశారు. పోలీసులు పేర్కొన్న సాక్ష్యాధారాలన్నీ కూడా బిఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని చెపుతున్నాయి. కనుక ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడిందనే చెప్పవచ్చు.
కానీ రెండు పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్ధిపై ఎదురుదాడి చేస్తూ ఈ ఊబిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం.