ఓ పక్క యుద్ధాలు... మరోపక్క సంబురాలు!

November 15, 2024


img

బొటాబోటి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం 6 నెలలు కూడా ఉండదు. ఏ క్షణంలోనైనా కూలిపోతుందని బిఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటుండగానే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్‌ 7వ తేదీన ఏడాది పూర్తిచేసుకోబోతోంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 7న టాంక్ బండ్‌ వద్ద, 8న సచివాలయం ఆవరణలో, 9న నెక్లెస్ రోడ్డులో, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఓ పక్క బిఆర్ఎస్ పార్టీ, మరోపక్క కేంద్రం (బీజేపీ) నుంచి సవాళ్ళు ఎదుర్కొంటూనే, పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా అందరినీ సంతృప్తిపరుస్తూ ప్రభుత్వాన్ని నడపడం కత్తి సాము వంటిదే అని చెప్పవచ్చు. కనుక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబురాలు చేసుకోవడం సమంజసమే. 

అయితే ఎన్నికలలో ఓటమి తర్వాత ఎంతో డీలా పడిన బిఆర్ఎస్ పార్టీ నేడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదిగే స్థాయికి చేరుకుందనే విషయం మరిచిపోకూడదు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ గడప దాటి బయటకు రాకపోయినా కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ అన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదుర్కొంటూనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. 

కనుక ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ రెండూ కూడా సమానంగా సవాళ్ళు ఎదుర్కొంటూ, పోరాడుకుంటూ ఏడాది ముగిసే సమయానికి సమ ఉజ్జీలుగా నిలిచాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ భీకర రాజకీయ యుద్ధం మద్యలో సంబురాలు చేసుకోవడం కాంగ్రెస్‌కే చెల్లునేమో?


Related Post