తమిళ నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్

November 14, 2024


img

తమిళ నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలుగుజాతిని కించపరుస్తూ ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై  చెన్నైలోని తెలుగు సంఘం ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి నోటీస్‌ ఇచ్చేందుకు ప్రయత్నించగా, అరెస్ట్ భయంతో ఆమె సెల్ ఫోన్‌ స్వీచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 

ముందస్తు బెయిల్‌ కోసం తన న్యాయవాది ద్వారా మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ జస్టిస్ ఆనంద్ వెంకటేశన్ ఆమె పిటిషన్‌ని తిరస్కరించారు. కనుక ఆమె హైకోర్టు బెంచ్‌ని ఆశ్రయించే అవకాశం ఉంది. 

నవంబర్‌ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రజలని కించపరిచే విదంగా మాట్లాడారు.

ఆమె ఏమన్నారంటే, “సుమారు 300 సంవత్సరాల క్రితం ఓ తమిళరాజు అంతఃపురంలో సేవలు చేసుకునేందుకు తెలుగువారు వచ్చారు. ఇప్పుడు మేమూ తమిళులమే అని వాదిస్తున్నారు. మరైతే ఎప్పుడో వచ్చి స్థిరపడిన బ్రాహ్మణులను తమిళులే అని ద్రవిడ సిద్దాంతవాదులు (డీఎంకే, అన్నా డీఎంకే)లు ఎందుకు అంగీకరించడం లేదు? 

ఎందుకంటే బ్రాహ్మణులు రాజులకు ఏకపత్నీవ్రతులుగా ఉండమని, పరస్త్రీలపై మోజు పడవద్దని, పరుల ఆస్తులను దోచుకోవవద్దని హితవు చెప్పేవారు గాబట్టే. అప్పటి నుంచే తమిళనాడులో రాజకీయ పార్టీలకు బ్రాహ్మణు విద్వేషం మొదలైంది. చివరికి అదే వారి విధానాలుగా మారిపోయాయి,” అని కస్తూరి విమర్శించారు. 

ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వాటిని ఉపసంహరించుకొని అందరికీ క్షమాపణలు చెప్పారు. కానీ తెలుగు సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 

ఆమెకు ఎప్పుడో అప్పుడు బెయిల్‌ లభించక తప్పదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో స్థిరపడిన తెలుగువారి కంటే ద్రవిడ పార్టీలైన అధికార, ప్రతిపక్ష డీఎంకే, అన్నా డీఎంకేలు ఆమెను విడిచిపెట్టకపోవచ్చు.


Related Post