తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని లేదా కూల్చేస్తామన్నట్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు బెదిరించేవారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి వారు ఆవిదంగా మాట్లాడటం చాలా తప్పని అందరూ అంగీకరిస్తారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్, టిడిపిల వలన తన ప్రభుత్వానికి ప్రమాదం ఉందంటూ వాటిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు హెచ్చరికలతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో ఆకర్షించుకొని తన ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చివేయకుండా జాగ్రత్త పడితే అన్యాయం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని గగ్గోలు పెడుతూ హైకోర్టుకి కూడా వెళ్ళారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలద్రొక్కుకునేందుకు ఓ ఏడాది సమయం ఇస్తామని చెప్పిన బిఆర్ఎస్ నేతలు నెల తిరక్కుండానే ఈవిదంగా వ్యవహరిస్తుండటంతో రేవంత్ రెడ్డి కూడా వారి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తున్నారు. వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకి వెళ్ళక తప్పదని హెచ్చరిస్తున్నారు. గవర్నర్ అనుమతి లభించగానే కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అదే హెచ్చరిక చేశారు. అరెస్ట్ భయంతోనే కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారని కానీ కేటీఆర్‌ని ఎవరూ కాదరని అన్నారు.
అయితే కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావులను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కనీసం కేసీఆర్‌కి నోటీస్ జారీ చేయకపోవడమే ఇందుకు నిదర్శమని వాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకుంటూ రాష్ట్రంలో బీజేపీ ఎడగకుండా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
కేటీఆర్ కూడా “దమ్ముంటే అరెస్ట్ నన్ను చేస్తే చేసుకోండి. నేడు రెడీ. రెండు నెలల్లో ‘ఫిట్’గా బయటకు వచ్చేస్తాను,” అని సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు కూడా.
వారిని అరెస్ట్ చేస్తే బిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలలో సానుభూతి, తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది కూడా. పైగా వారిని ఏ కేసులో అరెస్ట్ చేసినా రెండు నెలల్లో బయటకు వచ్చేయగలరు. అందువల్లే సిఎం రేవంత్ రెడ్డి వారిని అరెస్ట్ చేయడానికి తొందరపడటం లేదనుకోవచ్చు. కానీ ఏదోరోజు అరెస్ట్ చేయడం ఖాయమే అని కేసులు సూచిస్తున్నాయి.