లగచర్ల దాడి కేసులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు వినిపించడంతో బిఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు నిన్న రాత్రి హైదరాబాద్‌లో నంది నగర్ వద్ద గల కేటీఆర్ ఇంటికి చేరుకొని అర్దరాత్రి వరకు అక్కడే ఉన్నారు. కేటీఆర్‌ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావచ్చనే ఊహాగానాలతో కేటీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఒకవేళ కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తే భవిష్య కార్యాచరణ గురించి బిఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్‌లు లోపల చర్చించిస్తుండగా బయట కార్యకర్తలు ‘కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి,’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
నిన్న పోలీసులు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు రిమాండ్ రిపోర్టులో ఆయనని కేటీఆరే ప్రోత్సహించారని తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని పేర్కొనడంతో, పోలీసులు ఆయనని కూడా అరెస్ట్ చేయడం ఖాయమనే బిఆర్ఎస్ నేతలు భావించారు. కానీ పోలీసులు అటువంటి ప్రయత్నం ఏదీ చేయలేదు.
కేటీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెపుతున్నారు. అంటే కేటీఆర్‌ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కానీ గవర్నర్ అనుమతి లభించాల్సి ఉందని స్పష్టమవుతోంది.
సిఎం రేవంత్ రెడ్డి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత, ఇంకా గవర్నర్ అనుమతి లభించలేదని తెలిసి కూడా పోలీసులు కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారంటూ బిఆర్ఎస్ నేతలు హడావుడి చేయడం చూస్తే ఈవిదంగా కూడా బిఆర్ఎస్ పార్టీ రాజకీయ మైలేజి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.
ముఖ్యంగా వరుస ఓటములతో ఢీలా పడినా బిఆర్ఎస్ శ్రేణులలో మళ్ళీ భావోద్వేగాలు రగిలించి చురుకుగా మారేందుకు కూడా కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారంటూ హడావుడి చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.
ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల కంటే ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీయే కేటీఆర్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తోంది.