ఆటంబాంబు కధ కేటీఆర్‌ చెప్పేశారుగా!

November 09, 2024


img

మూడు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ, త్వరలోనే ఆటంబాంబు పేలబోతోంది. రూ.55 కోట్లు అక్రమంగా విదేశాలకి పంపింవారు సిద్దంగా ఉండండి. ఈ వ్యవహారంతో సంబందం లేనివారు భయపడక్కర లేదు. సంబంధం ఉన్నవారు మాత్రం సిద్దంగా ఉండండి,” అంటూ హెచ్చరించారు. 

తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణ వ్యవహారంలో ఏవో అక్రమాలు జరిగాయని అందుకు నన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన అసమర్ధత, వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఇటువంటి చవుకబారు ప్రయత్నాలు చేస్తోంది. 

సిఎం రేవంత్‌ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించి పైశాచికానందం పొందాలనుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి. నాకేం భయం లేదు. అయినా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఓ రెండు నెలలు జైల్లో ఉండి యోగా అది చేసుకుని ట్రిమ్‌గా తయారయ్యి బయటకు వచ్చేస్తాను. ఆ తర్వాత పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ బండారం అంతా బయటపెడతాను. 

ఫార్ములా-1 రేసులో ఏదో జరగరానిది జరిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు కనుక దాని గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాపై ఉంది కనుక ఇదంతా వివరిస్తున్నాను. 

ఫార్ములా-1 రేస్ నిర్వహణకు ఆ సంస్థ ఎఫ్ఐఏ, స్పాన్సర్ గ్రీన్ కో, హెచ్ఎండీఏల మద్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. మొదటి విడతలో తమకు ఆశించిన స్థాయిలో లాభం రాలేదని స్పాన్సర్ గ్రీన్ కో తప్పుకుంది. దాని వలన హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బ తినకుండా కాపాడేందుకు ప్రభుత్వం తరపున రూ.55 కోట్లు ఖర్చు చేశాము. 

మునిసిపల్ శాఖ మంత్రిగా ఆ ఫైలు మీద నేనే సంతకం చేశాను. ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ కార్యదర్శి అరవింద్ కుమార్‌కి ఎటువంటి సంబందమూ లేదు. ఆయన తప్పేమీ లేదు. రూ.55 కోట్లు ఖర్చుకి నేనే అనుమతించాను. కనుక దీనికి పూర్తి బాధ్యత నాదే. 

మేము ఇంత ప్రతిష్టాత్మకంగా భావించి రెండో విడత ఎఫ్‌-1 రేసింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తే, రేవంత్‌ రెడ్డి అధికారంలోకి రాగానే నాపై ఈర్ష్య, కక్షతోనే ఏకపక్షంగా రద్దు చేసి అంతర్జాతీయంగా హైదరాబాద్‌ పరువు తీశారు. ఈ రేస్ జరిగి ఉంటే రూ.700 కోట్లు ఆదాయం వచ్చి ఉండేది కానీ రేవంత్‌ రెడ్డి దానిని కాలదన్నుకున్నారు. కనుక కేసు పెట్టదలిస్తే ముందుగా ఆయనపైనే పెట్టాలి. 

ఎఫ్‌-1 రేసింగ్ కోసం మా ప్రభుత్వం రూ.55 కోట్లు ఖర్చు చేస్తే దానిపై ఈవిదంగా నీచ రాజకీయాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి, లక్షల కోట్లు ఖర్చుచేసి ఒలింపిక్స్ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది,” అని కేటీఆర్‌ అన్నారు. 


Related Post