కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సిఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు గుప్పించారు. “వారిద్దరి మద్య మంచి అవగాహన ఉంది కనుకనే రేవంత్ రెడ్డి కేటీఆర్ జోలికి వెళ్ళడం లేదు. అందుకే జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ కేసుని మెల్లగా అటకెక్కించేశారు. తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా అవకాశం లేకుండా చేయడానికి వారిరువురూ కుమ్మక్కు అయ్యారు. ఇద్దరూ పగలు పరస్పరం విమర్శించుకుంటారు. రాత్రి వాటిని సెటిల్ చేసుకుంటారు.
కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌ని నేడో రేపో అరెస్ట్ చేస్తామన్నట్లు గావుకేకలు పెట్టడమే తప్ప అతని జోలికి వెళ్ళలేరు. నిజానికి బీజేపీ కాదు.... రేవంత్ రెడ్డి, కేటీఆరే పరస్పరం కాపాడుకుంటూ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇద్దరికీ నన్ను, బీజేపీని నిందించడం దూరాలవాటుగా మారింది.
రేవంత్ రెడ్డిని కూతురు పెళ్ళి కూడా చేసుకోనీయకుండా జయలుకి పంపించి కేసీఆర్ ఇబ్బంది పెట్టారు. అప్పుడే అది మరిచిపోయి అదే బిఆర్ఎస్ నేతలతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు అవుతుండటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని అన్ని ఆధారాలు లభించినా ఆయనని రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఈ కుమ్మక్కు రాజకీయాలే కారణం,” అని బండి సంజయ్ ఆరోపించారు.