హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశం జరుగుతోంది. దాయిలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, నగర సీపీ సీవీ ఆనంద్, సీఐడీ చీఫ్ శిఖా గోయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, “గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు, మోసాలు 24 శాతం పెరిగాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయమే.
సామాన్య ప్రజల కంటే ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు.
ఈ సైబర్ నేరాలను, నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం, వారి నుంచి సొమ్ము రికవరీ చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ దాదాపు రూ.34 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగించాము.
మొత్తం 36 రకాల సైబర్ మోసాలను గుర్తించి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాము. అయినప్పటికీ ఎప్పటికప్పుడు సరికొత్త పద్దతిలో సైబర్ నేరగాళ్ళు దోచుకొంటూనే ఉన్నారు. కనుక ప్రజలందరూ ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం,” అని అన్నారు.