ఏపీకి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖని రాజధాని చేస్తానంటూ చాలా కబుర్లు చెప్పారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్నా రాజధాని ఏర్పాటు చేయలేదు కానీ ప్రజాధనంతో విశాఖ సముద్ర తీరం పక్కనే ఉన్న ఋషికొండని తవ్వించేసి దానిపై సుమారు రూ.500 కోట్ల ప్రజాధనంతో తాను, తన భార్యాపిల్లల కోసం అత్యంత విలాసవంతమైన ప్యాలస్‌లు కట్టించుకున్నారు.
మళ్ళీ తానే అధికారంలోకి వస్తాననే ధీమాతోనే విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చుచేసి అత్యంత విలాసవంతంగా కట్టించుకున్నారు.
వాటిలో ఒక్కో లెట్రిన్ కమోడ్ ధర రూ.12 లక్షలు కాగా మసాజ్ కోసం విదేశాల నుంచి రప్పించుకున్న టేబిల్ ఖరీదు రూ.3 కోట్లు. స్నానం చేసేందుకు తెప్పించుకున్న బాత్ టబ్ ఖరీదు రూ.36 లక్షలు కాగా, కర్టెన్లు, సోఫాలు వగైరా ఖరీదు రూ. 11.24 కోట్లు.
ఋషికొండపై మొత్తం ఏడు భవనాలు నిర్మించుకున్నారు. వాటిలో ఫ్లోరింగ్ కోసం ఇటలీ నుంచి మార్బెల్స్ తెప్పించి వేయించుకున్నారు. వాటి ఖరీదు చదరపు అడుగుకి రూ.3 లక్షలు మాత్రమే. కానీ పాపం జగన్ ఆ భవనంలో అడుగుపెట్టకుండానే అధికారంలో నుంచి దిగిపోయారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం ఆ ప్యాలస్‌లు సందర్శించి ఆ రాజభోగాలు చూసి దిగ్బ్రాంతి చెందారు. జగన్ కట్టుకున్న ఈ ప్యాలస్‌లవంటివి ముందెన్నడూ చూడలేదన్నారు.
ఓ వ్యక్తి, కుటుంబం కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి ఇంత పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టుకోవడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. జవాబుదారీతనం లేకపోవడం, ప్రజలంటే లెక్కలేనితనం వల్లనే జగన్ ఇంత ఖర్చుపెట్టేసి తన కోసం కట్టుకోగలిగాడని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇన్ని వందల కోట్లతో ఇంత విలాసవంతంగా నిర్మించిన ఈ భవనాలను ప్రభుత్వం ఏవిదంగానూ వాడుకోలేదని, వీటిని ఏం చేయాలో అర్దం కావడం లేదన్నారు. త్వరలోనే ప్రజలను ఈ భవనాలను చూసేందుకు అనుమతిస్తామని, వీటిని ఏవిదంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రజలే చెప్పాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.