ఏపీకి రూ.70,000 కోట్లు పెట్టుబడులు... మరి తెలంగాణకి?

October 31, 2024


img

ఇదివరకు అంటే తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, తెలంగాణకు వేలకోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తరలివస్తుంటే, ఏపీ ప్రజలు తమ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని తెలంగాణతో పోల్చి చూసుకొని బాధపడేవారు. 

జగన్‌కి సంక్షేమ పధకాలపై ఉన్న శ్రద్ద పెట్టుబడులు, పరిశ్రమలు సాధించడంలో లేదని బాధపడేవారు. జగన్‌ నిర్లక్ష్యం కారణంగానే ఏపీలో ఉద్యోగాలు, ఉపాధి లభించక లక్షల మంది తెలంగాణకు తరలివస్తుండేవారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉద్యోగ ఉపాది అవకాశాలు పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. 

కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిన తర్వాత పరిస్థితి తారుమారు అయిన్నట్లు కనిపిస్తోంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పెట్టుబడుల కోసం దావోస్ సదస్సుకి, ఆ తర్వాత మరోసారి అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి వచ్చారు. 

కానీ ఈ 10 నెలల్లో రాష్ట్రానికి పెద్దగా పెట్టుబడులు సాధించలేకపోయారు. కానీ హైడ్రాతో, ఇప్పుడు మూసీ ప్రక్షాళనతో జనాలను హడల్ ఎత్తిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ఇదే సమయంలో ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడటంతో ఆ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు, పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

చంద్రబాబు నాయుడి సానుకూల దృక్పదం, దూరదృష్టి, ఐ‌టి రంగం పట్ల అవగాహన, ఆసక్తి వలన పారిశ్రామికవేత్తలు, ఐ‌టి కంపెనీలు మళ్ళీ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ ఐ‌టి మంత్రి నారా లోకేష్‌ అమెరికాలో పర్యటిస్తూ పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఇటీవలే దుబాయ్‌కి చెందిన లులూ గ్రూప్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టి హైపర్ మార్కెట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ కంపెనీతో చర్చలు నడుస్తున్నాయి. 

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏపీ ప్రభుత్వం డ్రోన్‌ హబ్ ఏర్పాటు చేస్తోంది. దానిలో కేవలం డ్రోన్‌లు, విడిభాగాల తయారీ, వాటి మరమత్తులు, వాటి శిక్షణకు సంబందించి కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. 

తాజాగా అనకాపల్లి జిల్లాలో రూ.70,000 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు మిట్టల్, నిప్పన్ కంపెనీలు ప్రతిపాదనలు ఇచ్చాయి. దీనికి అవసరమైన ముడి సరుకు దిగుమతి చేసుకునేందుకు సమీపంలో సముద్రతీరంలో ఓ భారీ పోర్ట్ కూడా నిర్మిస్తామని చెప్పాయి. 

ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అందుబాటులో ఉన్న 2,200 ఎకరాలు ఈ సంస్థలకి కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిన్నట్లు తెలుస్తోంది. ఇది మొదటి దశ మాత్రమే. 

2029 జనవరి నాటికి మొదటి దశ నిర్మాణపనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగానే, సుమారు లక్ష కోట్లతో రెండో దశ స్టీల్ ప్లాంట్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేసేందుకు అవి సిద్దంగా ఉన్నాయి. 

అంటే ఈ ఒక్క స్టీల్ ప్లాంట్‌ ద్వారానే ఏపీకి సుమారు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో సుమారు 40,000 మందికి పైగా ఉద్యోగాలు రాబోతున్నాయన్న మాట! మరి తెలంగాణ పరిస్థితి?అని ఇప్పుడు ఆలోచించుకోవలసి వస్తోంది.


Related Post