దీపావళి పండుగలోపుగా బిఆర్ఎస్ పార్టీలో బాంబులు పేలబోతున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించగా, ‘కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయదలచుకుంటే నేను రెడీ’ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.
తాజాగా పార్టీ శ్రేణులను ఉద్దేశ్యించి, “మనం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగడుతుంటే సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు చాలా అసహనంగా ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో మనపై కేసులు, వేధింపులు మరింత పెరగొచ్చు. కనుక పార్టీ శ్రేణులు అందరూ ఇటువంటి వాటికి భయపడకుండా ప్రజాసమస్యల పరిష్కారం కోసం మరింత గట్టిగా ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దం కావాలి. ఎప్పుడు ఏం జరిగినా ఎవరూ అధైర్యపడకూడదు. మీ లక్ష్యాన్ని మరిచిపోవద్దు,” అని కేటీఆర్ అన్నారు.
కనుక కేటీఆర్ తాను మానసికంగా అరెస్టుకి సిద్దపడుతూ, పార్టీ క్యాడర్ని కూడా సిద్దపరుస్తున్నట్లే అనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలు, ధరణి పోర్టల్ ఇంకా పలు అంశాలపై సమాంతరంగా విచారణ జరిపిస్తోంది. వాటిలో ఏదో ఓ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కాస్త ముందూ వెనుకగా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. కేటీఆర్ చెప్పిన ఈ మాటలు వింటే పోలీసులు ముందుగా తననే అరెస్ట్ చేస్తారని కేటీఆర్ భావిస్తున్నట్లున్నారు.