రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులతో కలిసి భారీ ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ వేశారు.
చాలా అట్టహాసంగా సాగిన వారి రోడ్ షోకి భారీగా పార్టీ కార్యకర్తలు, జనాలు తరలివచ్చారు. ఆమె తొలిసారిగా ఎన్నికలలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావిస్తున్న వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రియాంకా గాంధీపై బీజేపీ అభ్యర్ధిగా నవ్య హరిదాస్, సీపీఐ సీనియర్ నేత సత్యాన్ మోకేరి పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ గెలిస్తే రాహుల్ గాంధీ ఖాళీ చేసిన సీటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దక్కిన్నట్లవుతుంది. ఆమె తొలిసారిగా పార్లమెంటులో సభ్యురాలిగా అడుగుపెడతారు.
కానీ కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ అంతటి స్థాయి నేత ఓడిపోతే, ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.