కాళేశ్వరంపై విచారణతో ప్రభుత్వం ఏం సాధించబోతోంది?

October 22, 2024


img

కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణం... చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేది. ప్రభుత్వం మారగానే అదే ప్రాజెక్ట్ ఓ పనికిమాలిన, అవినీతికి గేట్లు ఎత్తిన ప్రాజెక్టుగా మారిపోవడం ఆశ్చచర్యం కలిగిస్తుంది. 

దానిలో వేలకోట్లు అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, నాసిరకం నిర్మాణాల వలన మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోగా, అన్నారం బ్యారేజీ గోడలు పగిలి నీళ్ళు కారిపోతున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అది కళ్ళకి కనిపిస్తున్న వాస్తవలే!

కనుక రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ చేత విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ లోతుగా దర్యాప్తు జరిపి భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. కనుక జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ విచారణలో కూడా అదే తేలవచ్చు. 

బుధవారం నుంచి మళ్ళీ విచారణ చేపట్టి ఆ ప్రాజెక్టులో పనిచేసి రిటైర్ అయిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించనున్నారు. వారిలో పలువురిని కమీషన్‌ ఇదివరకే ప్రశ్నించింది. అయితే అప్పుడు వారు పూర్తి వివరాలు తెలియజేయలేకపోవడంతో, మళ్ళీ విచారణకు పిలిపిస్తోంది. 

చివరిగా మాజీ సిఎం కేసీఆర్‌, మాజీ ఆర్ధిక, సాగునీటి శాఖల మంత్రి హరీష్ రావులకు కూడా నోటీసులు పంపించి విచారణకు పిలిపించడం తధ్యం. అయితే ఇదివరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నించేందుకు కమీషన్‌ నోటీసులు పంపించినప్పుడు కేసీఆర్‌, జగదీష్ రెడ్డి ఏవిదంగా లేఖలు వ్రాసి, సుప్రీంకోర్టులో కేసు వేసి హాజరుకాకుండా తప్పించుకున్నారో ఇప్పుడూ అలాగే చేయవచ్చు.  

ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పీసి ఘోష్ కమీషన్‌ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నేరుగా కేసీఆర్‌, హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తప్పనిసరిగా కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఒకసారి కోర్టులో కేసు పడితే దాని విచారణ ఎప్పటికీ పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. 

ఒకవేళ కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ కేసులన్నీ అటకెక్కిపోతాయి. కనుక ఈ కమీషన్లు, విచారణతో ప్రభుత్వం ఏమి సాధించాలని భావిస్తోంది? అనే సందేహం కలుగక మానదు.


Related Post