ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. కానీ ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేయలేదు. తొలిసారిగా ఆమె కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ అమెధీ, వయనాడ్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచారు. తర్వాత అమెధీ సీటు ఉంచుకొని వయనాడ్ వదులుకున్నారు. కనుక ఇప్పుడు ఆ సీటుకి ఉప ఎన్నిక జరుగబోతోంది.
వయనాడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారడంతో ఈసారి ప్రియాంకా గాంధీని అక్కడి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. తద్వారా మళ్ళీ ఆ సీటుని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలుగుతుంది. అక్కడ గెలుపు ఖాయం కనుక ప్రియాంకా గాంధీ తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టగలుగుతారు కూడా.
అయితే కేరళలో ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ చాలా కాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక కేరళ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ్య హరిదాస్‌ని వయనాడ్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా ప్రకటించింది. ఆమె రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొంటారు. కనుక ఆమె అయితేనే ప్రియాంకా గాంధీకి గట్టి పోటీ ఇవ్వగలరని బీజేపీ భావిస్తోంది.
దేశంలో 48 శాసనసభ, 2 లోక్‌సభ నియోజకవర్గాలకు నవంబర్ 13, 20వ తేదీలలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.