తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని కేసీఆర్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం విమర్శిస్తుండేవారు. నేటికీ కేంద్రం తీరు మారలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కి ఇస్తున్నంత ప్రాధాన్యం మరే రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఎందుకంటే అది మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కనుక. కానీ తాము యావత్ దేశానికి పాలకులమనే సంగతి వారు గుర్తుంచుకోవాలి.
కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో పండిస్తున్న పత్తికి క్వింటాకు రూ.8,257 మద్దతు ధర చెల్లిస్తోంది. కానీ తెలంగాణలో అంత కంటే నాణ్యమైన పత్తికి క్వింటాకు రూ.7,521 మాత్రమే చెల్లిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ అని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం పత్తితో సహా వ్యవసాయ పంటలకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మద్దతు ధర ఎందుకు ప్రకటిస్తోంది? గుజరాత్ పత్తికి ఎక్కువ ధర, తెలంగాణ పత్తికి తక్కువ ధర ఎందుకు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కూడా హరీష్ రావు ఓ సందేశం పెట్టారు.