తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ 10 నెలల్లో రూ.80,500 కోట్లు అప్పులు చేసిందంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. వివిద ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చాలా ఆలస్యమవుతుండటంపై పత్రికలలో వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానంగా తెలంగాణ ఆర్ధికశాఖ వివరణ ఇచ్చింది.
డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూ.49,618 కోట్లు అప్పులు మాత్రమే తీసుకుందని తెలిపింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులకే రూ.56,440 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపింది. పాత అప్పుల అసలు, వడ్డీలు ప్రభుత్వానికి పెనుభారంగా మారాయని, కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందుకు ధీటుగా లేకపోవడంతో పాత అప్పుల చెల్లింపులకి కొత్త అప్పు చేయక తప్పలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ తెలిపింది.
తెచ్చిన అప్పంతా పాత అప్పుళ చెల్లింపులకే పోతుండటంతో అభివృద్ధి, సంక్షేమ పధకాలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించలేకపోతోందని తెలిపింది.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు మాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కళ్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డులు బియ్యం, ఉపకార వేతనాలు వంటివాటి కోసం రూ.54,346 కోట్లు ఖర్చు చేసిందని ఆర్ధికశాఖ తెలియజేసింది.
ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటున్నా ప్రతీనెల 1వ తారీకునే ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెంషన్లు చెల్లిస్తోందని తెలిపింది.