రాజకీయాల నుంచి కేసీఆర్‌ తప్పుకోబోతున్నారా?

October 13, 2024


img

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఆ పార్టీ నేతలకు, ముఖ్యంగా కేసీఆర్‌కి పెద్ద షాక్. దాని నుంచి తేరుకుని లోక్‌సభ ఎన్నికలలో పాల్గొంటే వాటిలో ఇంకా పెద్ద షాక్ తగిలింది. నిజానికి రెండు ఎన్నికలను ఒకేసారి ఎదుర్కోవడం కంటే వేర్వేరుగా అయితే చాలా సులువుగా విజయం సాధించవచ్చనే ఆలోచనతోనే కేసీఆర్‌ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. కానీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్ళినా ఆశించిన ఫలితం రాకపోగా ఎదురుదెబ్బలు తగిలాయి. 

వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు చాలా నిరాశానిస్పృహలతో క్రుంగిపోతాయి. అటువంటప్పుడు వారికి ధైర్యం చెప్పి ముందుండి పార్టీని నడిపించాల్సిన కేసీఆర్‌, గత 10 నెలలుగా పార్టీకి, ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు. 

కనీసం శాసనసభ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయినప్పుడు ప్రజల మద్యకు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. కానీ రాలేదు. 

హైడ్రా దెబ్బకి పేదలు, మద్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. అప్పుడైనా కేసీఆర్‌ బయటకు వచ్చి వారిని ఓదార్చి ప్రభుత్వంతో పోరాడవచ్చు. కానీ రాలేదు. 

అంటే పదవి అధికారం చేతిలో ఉంటేనే కేసీఆర్‌ ప్రజలకి, మీడియాకి కనిపిస్తారా? లేకుంటే కనిపించరా? అని గజ్వేల్ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. ‘కేసీఆర్‌ కనబడుట లేదు’ అని పోస్టర్లు పెట్టారు కూడా. అయినా కేసీఆర్‌ స్పందించలేదు. 

కనీసం కేటీఆర్‌, హరీష్ రావుల చేత తన రాజకీయ ఏకాంతం, మౌనం దేనికో... ఎప్పటి వరకో చెప్పించలేదు. బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. కనుక పార్టీ పగ్గాలను కేటీఆర్‌, హరీష్ రావులకు అప్పగించేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారేమో?అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవునో కాదో వారే చెప్పాలి. 



Related Post