కొందరు పదవులు, అధికారంతో గొప్పవారవుతారు. కొందరు దేశ సేవచేసి గొప్పవారిగా గుర్తింపు పొందుతారు. కొందరు భారీగా డబ్బు సంపాదించి దాన ధర్మాలు చేస్తూ గొప్పవారని అనిపించుకుంటారు. కానీ నైతిక విలువలకు కట్టుబడి దేశ హితం, సమాజ హితం కోసం కృషి చేసి మహనీయులైనవారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటివారిలో రతన్ టాటా కూడా ఒకరు.
ఆయన కంటే ఎక్కువ డబ్బు, ఆస్తులు, షేర్ మార్కెట్ వాల్యూ, భారీ పరిశ్రమలు, కార్పొరేట్ కంపెనీలు ఉన్న ముఖేష్ అంబానీ వంటి అనేక మంది పారిశ్రామికవేత్తలున్నారు. కానీ రతన్ టాటా మరణించిన వార్త తెలియగానే యావత్ దేశ ప్రజలు స్పందించిన తీరు చూసినప్పుడు ఆయనకు ఎంత ప్రజాధరణ, గౌరవం ఉన్నాయో స్పష్టమయ్యింది.
ఆయన పరిశ్రమలు, ఐటి కంపెనీలు స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించినందునే ఆయనని గౌరవిస్తున్నారని అనుకోవడానికి లేదు. దేశంలో కోట్లాదిమంది ప్రజలు ఏనాడూ రతన్ టాటాని స్వయంగా చూసింది లేదు కలిసిందీ లేదు. కనీసం ఆయన సాయం పొందిందీ లేదు. అయినప్పటికీ రతన్ టాటా పట్ల దేశ ప్రజలు చూపిన అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు, గౌరవం ఆయన ఎంత గొప్పవారో తెలియజేస్తున్నాయి.
ఆయన చేపట్టే ప్రతీపని, వ్యాపారంలో దేశం, సమాజం పట్ల నిబద్దత, నైతిక విలువలు అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. సామాన్య మద్య తరగతి ప్రజల అవసరాలను అందరూ గొప్ప వ్యాపార వస్తువుగా భావించి అటువంటి ఉత్పత్తులు అందిస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తుంటారు.
కానీ రతన్ టాటా మాత్రం వారికి తాను, తన సంస్థలు, తన సంపదలు ఏవిదంగా ఉపయోగపడతాయా అని ఆలోచించేవారు. ఆవిదంగా అందించినదే నానో కారు.
రతన్ టాటా చేసిన విజయవంతమైన వ్యాపారాల వలన డబ్బు, పేరు లభించి ఉండవచ్చు. కానీ టాటా గ్రూప్ ఆశయాలైన మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులను ఆయన ఆచరణలో చేసి చూపినందునే, యావత్ దేశ ప్రజలు మనస్ఫూర్తిగా రతన్ టాటాకి కన్నీటి నివాళులు ఆర్పిస్తున్నారు.
కోట్లాదిమంది ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న భాగ్యవంతుడు రతన్ టాటా. ఆయనకి మైతెలంగాణ. డాట్.కామ్ తరపున అశ్రు నివాళులు!