మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు అందరూ పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తుండటం చూస్తే, ఎలాంటి వివాదంపై స్పందించడానికి ఇష్టపడని టాలీవుడ్ హీరోలకి హటాత్తుగా ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా?
ఆమె వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉండటంతో ఒకరిని చూసి మరొకరు ధైర్యం తెచ్చుకొని విమర్శలు గుప్పిస్తున్నారా?లేక మరేమైనా కారణం ఉందా?అనే సందేహం కలుగుతుంది.
ఎందువల్ల అంటే, ఇదివరకు ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం జగన్‌తో సహా వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి , ఆయన మాజీ భార్యల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు, టాలీవుడ్‌లో ఎవరూ ధైర్యం చేసి నోరు విప్పి మాట్లాడలేదు.
చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు టాలీవుడ్ జూ.ఎన్టీఆర్‌తో సహా ఎవరూ నోరు విప్పలేదు. ఎందువల్ల అంటే అప్పుడు నోరు విప్పి మాట్లాడితే ఏపీలో తమ సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతాయని కావచ్చు.
మరిప్పుడు మంత్రి కొండా సురేఖని విమర్శిస్తే తెలంగాణలో వారి సినిమాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగవని వారు భావిస్తున్నారా? భావిస్తున్నట్లయితే వారి ధైర్యానికి కారణం ఏమిటి? ఎవరు? అనే సందేహాలు కలుగుతాయి.
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పోటాపోటీగా మహిళల గౌరవానికి భంగం కలిగిందంటూ మంత్రి కొండా సురేఖపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు సరే! ఒకవేళ మహిళల గౌరవానికి భంగం కలిగిందని వారు భావిస్తున్నట్లయితే అందరూ సమంతకి బహిరంగంగా మద్దతు తెలపాలి. కానీ ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆమెకు మద్దతు తెలుపలేదు. అందరూ మంత్రి కొండా సురేఖనే విమర్శించడానికే ఆసక్తి చూపుతున్నారు.
నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం బహుశః వారందరి ఆగ్రహానికి మూల కారణం అయ్యుండవచ్చు. గమ్మతైన విషయం ఏమిటంటే అప్పుడూ ఒకరిద్దరు తప్ప టాలీవుడ్‌లో ఎవరూ ఆ కూల్చివేతపై స్పందించలేదు.
బహుశః ఆ కూల్చివేత ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్‌లో తామందరికీ చేసిన హెచ్చరికగా భావించారేమో తెలీదు. కారణాలు ఏవైనప్పటికీ టాలీవుడ్ హీరోల ఆగ్రహావేశాలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.