ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి 8.30 గంటలకు హడావువిడిగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారని బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పింది. ఇప్పుడు అదే జరుగుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 10 నెలలల్లో కనీసం 10-12 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు.
హైడ్రా కూల్చివేతలతో బాధిత ప్రజలు, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమతమై సిఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి ఉండవచ్చు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వల్ప అస్వస్థతకి గురైనందున ఆయనని పరామర్శించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారని, మంత్రివర్గ విస్తరణ, నామినేటడ్ పదవుల గురించి చర్చించడానికి వెళ్ళారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా ఇంత వరకు మంత్రివర్గ విస్తరణ చేయకపోవడంతో పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. హైడ్రా కూల్చివేతల కారణంగా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది. కనుక మంత్రివర్గ విస్తరణ జరిపి పదవులు ఆశిస్తున్న నేతలను సంతృప్తి పరిస్తే వారు తనకి అండగా నిలబడి మాట్లాడుతారని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తుండవచ్చు. బహుశః అందుకే మళ్ళీ ఢిల్లీ వెళ్ళారేమో?