అప్పుడు ఆక్రమణలు తొలగించాలని కేసీఆర్‌ అన్నారుగా?

September 29, 2024


img

హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. కానీ ఇప్పుడు బాధితులు వచ్చి మొర పెట్టుకొంటుండటంతో ఆ పార్టీ నేతలు రంగంలో దిగి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సిఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ కూడా హైడ్రా కూల్చివేతలని తప్పు పడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు రంగంలో దిగడంతో దీనిపై రాజకీయాలు మొదలయ్యాయి. 

బీజేపీ, బిఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఘాటుగా బదులిచ్చారు. “ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగరంలో సుమారు 28,000 అక్రమ కట్టడాలున్నాయని వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

కేసీఆర్‌ చేయలేని పని రేవంత్‌ రెడ్డి చేస్తుంటే బిఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారు? ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి విడిపించడానికే అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది తప్ప పనిగట్టుకొని ఎవరివో ఇళ్ళు కూల్చివేయడానికి కాదు. 

బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అన్నేళ్ళలో చెరువులు, నాలాలు కబ్జాలకు గురవుతుంటే ఏం చేశారు?అప్పుడు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చి ఇప్పుడు అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా? మీరు ఎవరి ఆస్తులను కాపాడటం కోసం రాజకీయాలు చేస్తున్నారు?అక్రమ కట్టడాలను, వాటి వెనుక పెద్దలని కాపాడేందుకు రాజకీయాలు చేస్తామంటే కుదరదు. 

ఒకవేళ హైడ్రా సిబ్బంది ఎక్కడైనా నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ ఇళ్ళు కూల్చేయాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు తప్పకుండా వెళ్ళి అడ్డుకోండి. అయినా మా ప్రభుత్వం నిరుపేదలు, మద్య తరగతి ప్రజల ఇళ్ళని కూల్చడం లేదు. మాకు ఆ అవసరం లేదు,” అని అద్దంకి  దయాకర్ అన్నారు.



Related Post