మరో వివాదం రాజేసిన జగన్‌

September 26, 2024


img

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి మరో కొత్త వివాదం రాజేశారు. ఎల్లుండి శనివారం తాను మెట్లదారిలో తిరుమల చేరుకొని శ్రీవారి ప్రత్యేక పూజలలో పాల్గొంటానని ప్రకటించారు. 

ఈ వ్యవహారంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలకు ప్రాయశ్చిత్తంగా తాను స్వామివారిని దర్శించుకుంటుంటానని చెప్పడంతో ఏపీలో టిడిపి నేతలు భగ్గు మంటున్నారు. జగన్‌ అన్య మతస్థుడు కనుక తిరుమల కొండపై అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా స్వామివారిపై నాకు నమ్మకం, భక్తి ఉన్నాయని తెలియజేస్తూ రిజిస్టర్‌లో సంతకం పెట్టాలని సూచించారు. 

మరో పక్క ఏపీ బీజేపీ నేతలు కూడా అదే చెపుతున్నారు. రిజిస్టర్‌లో సంతకం పెట్టకుండా కొండపైకి అనుమతించబోమని హెచ్చరిస్తున్నారు. 

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ, “ఇన్ని అపచారాలు చేసిన జగన్‌కి తిరుమల శ్రీవారి పేరు ఉచ్చరించేందుకు కూడా అర్హత లేదని, ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని హితవు పలికారు. 

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో భజన చేస్తూ తిరుపతి బయలుదేరిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలత మరో విదంగా స్పందించారు. జగన్‌ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు తనతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 

సిఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా తిరుమల పర్యటన పేరుతో వైసీపి శ్రేణులను పోగేసుకొని బయలుదేరుతూ అంత కంటే నీచ రాజకీయాలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

జగన్‌ ఈ ప్రకటన చేసినప్పటి నుంచి టిడిపి కూటమికి వైసీపికి మద్య తీవ్ర స్థాయిలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. జగన్‌ తిరుమలకి బయలుదేరితో ఏమవుతుందో తెలీని పరిస్థితి నెలకొని ఉంది. 


Related Post