వందే భారత్‌లో మాధవీలత భజన!

September 26, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన మాధవీ లత మొదటి నుంచి చాలా వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె తన అనుచరులతో కలిసి సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళారు. 

అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పబోరు. కానీ వారు హరేరామ హరేకృష్ణ అని భజన చేసుకుంటూ వెళ్ళారు. రైలులో హిందువులతో పాటు అన్ని మతాలవారు ప్రయాణిస్తుంటారు. కనుక ఇటువంటి చర్యలు వారికి అసహనం కలిగిస్తాయి. రైళ్ళలో ప్రయాణించే హిందువులు కూడా ఇటువంటి చర్యలను సమర్ధించలేరు. 

ఇదివరకు ఓ ఉత్తరాది రాష్ట్రంలో కొందరు ముస్లింలు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ నడిచే దారిలో వరుసగా నిలబడి నమాజు చేశారు. ప్రయాణికులకు అది ఎంత అసహనం కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఇతర మతస్తులు కూడా రైళ్ళలో ప్రార్ధనలు మొదలుపెడితే పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. 

మాధవీ లతకి అంతగా భక్తి ఉంటే ప్రత్యేక రైలు, బస్సు లేదా విమానం వేసుకొని తన అనుచరులతో భజనలు చేసుకుంటూ తిరుపతి మాత్రమే కాదు దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు కానీ అందరూ ప్రయాణించే రైల్లో మతం పేరుతో హడావుడి చేయడాన్ని ఎవరూ సమర్ధించరని గ్రహిస్తే మంచిది. 

మతం, భగవంతుడు, భక్తి అనేవి అనుసరించడానికి మాత్రమే కానీ ప్రదర్శించడానికి కాదనే విషయం ఎప్పటికీ తెలుసుకుంటారో?


Related Post