జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవర నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధర పెంచుకొని, అదనపు షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతిస్తూ జీవోలు జారీ చేశాయి.
అయితే ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీ ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరిస్తూ రేపటి నుంచి రెండు వారాలపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజాహిత పిటిషన్ దాఖలైంది.
దేవర ఎంత భారీ బడ్జెట్‌తో తీసినప్పటికీ దాని కోసం ప్రభుత్వం ప్రజలపై అన్ని రోజులు అదనపు భారం వేసేందుకు అనుమతించడం తగదని పిటిషనర్ వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు దేవర సినిమా టికెట్స్ పెంపుని 14 రోజుల నుంచి 10 రోజులకు కుదిస్తూ తీర్పు వెలువరించింది.
దీంతో దేవర నాలుగు రోజుల కలక్షన్స్ తగ్గుతాయి కనుక ఆ మేరకు ఆదాయం నష్టపోయిన్నట్లే. అయితే దేవర సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగితే, తగ్గిన ఆ ఆదాయాన్ని తిరిగి పొందడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇదివరకు ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరుల సినిమాలకు రాజకీయ కారాణాలతో అవరోధాలు సృష్టించేది. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం కూడా అదే కారణంతో దేవరకు లబ్ధి చేకూర్చాలనుకుంది. కానీ హైకోర్టు బ్రేకులు వేసింది.