ఒకప్పుడు ఆర్.కృష్ణయ్య అంటే బీసీల కోసం పోరాడే నాయకుడు కానీ ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి రాజకీయ నాయకుడుగానే కనిపిస్తున్నారు. ఆయన ఏపీలోని బీసీలందరినీ గంపగుత్తగా వైసీపిలోకి తీసుకువచ్చేస్తారని ఆశపడి మాజీ సిఎం జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ అలా జరుగలేదు.
జగన్, పార్టీ ఓడిపోయింది. దీంతో కృష్ణయ్య మళ్ళీ తెలంగాణ రాజకీయాలకు తిరిగి వచ్చేయాలని భావించి మంగళవారం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆయన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆర్.కృష్ణయ్య దానిలో చేరాలని అనుకుంటున్నారేమో? నేడో రేపో ఆయన చేరికపై స్పష్టత రావచ్చు.
ఇంతకీ ఆర్.కృష్ణయ్య తన పదవికి ఎందుకు రాజీనామా చేశారంటే తెలంగాణలో కుల గణన ఉద్యమం ప్రారంభించేందుకు అని చెప్పారు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు సాధించేందుకు గ్రామ స్థాయి నుంచి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్.కృష్ణయ్య అభిప్రాయ పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కుల గణన జరుపుతామని చెపుతోంది కనుక కాంగ్రెస్‌లో చేరేందుకు ఆర్.కృష్ణయ్యకి ఓ కారణం లభించిన్నట్లే.