రెండు మంత్రి పదవులిస్తే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ! మైనంపల్లి

September 24, 2024


img

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే చాలు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. రెండు మంత్రి పదవులు ఇస్తే చాలు… బిఆర్ఎస్ పార్టీలో 26 మంది ఎమ్మెల్యేలతో వచ్చేస్తామని మాకు కబురు పంపారు.

అప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురు తప్ప మిగిలిన అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. కానీ వాళ్ళు ముగ్గురూ మా మీద పడి ఏడుస్తారని మేము వాళ్ళ జోలికి పోలేదు. ఆలాచేస్తే ఈసారి సానుభూతి ఓట్లతో గెలిచేద్దామని వాళ్ళు ప్రయత్నిస్తారు.

మేము బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తెచ్చుకోకపోయినా వాళ్ళందరూ మావైపే ఉన్నట్లు భావిస్తున్నాము,” అని అన్నారు మైనంపల్లి. 

బిఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకున్న తర్వాత మళ్ళీ ఆ పార్టీ జోలికి వెళ్లలేదు. మైనంపల్లి చెప్పిన కారణం వల్ల కాకపోయినా, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు కాస్త కటువుగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాస్త ఆచితూచి అడుగు వేయాల్ని భావిస్తున్నట్లుంది.

బహుశః జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే అవకాశం ఉంటుంది. 


Related Post