సింగరేణి బోనస్‌పై కేటీఆర్‌ చిల్లర రాజకీయాలు అవసరమా?

September 22, 2024


img

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి సంస్థకు ఈసారి రూ.4,701 కోట్లు లాభాలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

దానిలో 33 శాతం అంటే కార్మికులకు బోనస్‌గా ఇచ్చామని చెప్పుకున్నారు. కానీ 33 శాతం అంటే రూ.1,551 కోట్లు అవుతుంది. కానీ మీరు రూ.796 కోట్లు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. 33 శాతం చొప్పున అయితే ఒక్కో కార్మికుడికి రూ.3.70 లక్షలు రావాలి కానీ రూ.1.90 లక్షలే మాత్రమే అందుతాయి. 

ప్రకటించిన బోనస్‌లో సగం మాత్రమే ఇస్తూ భారీగా బోనస్‌గా ఇచ్చామని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే వారినే మభ్యపెడతారా? ఇది బోనస్‌ కాదు బోగస్,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సింగరేణిని ప్రయివేటీకరణ చేస్తుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులను బోనస్‌గా పేరుతో మోసం చేస్తోంది,” అని కేటీఆర్‌ అన్నారు. 

అయితే మంత్రి భట్టి విక్రమార్క రూ.796 కోట్లు ఇస్తున్నామని స్పష్టంగా చెప్పారు కనుక పొరపాటున 33 శాతం అని ఉండవచ్చు. అయితే 2022-23లో బిఆర్ఎస్‌ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.1.60 లక్షలు బోనస్‌ ఇవ్వగా, 2023-24 సంవత్సరాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.1.90 లక్షల చొప్పున ఇస్తోంది.

అంటే బిఆర్ఎస్‌ కంటే మరో రూ.30 వేలు ఎక్కువే ఇస్తోంది. కనుక భట్టి విక్రమార్క చెప్పిన 33శాతం అనే మాట పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తోందని కేటీఆర్‌ వాదన అర్దరహితమే వారి భాషలోనే చెప్పాలంటే చిల్లర రాజకీయాలు చేయడమే! 


Related Post