రాజకీయ నాయకులపై ఎటువంటి కేసులైనా సరే విరాటపర్వంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచి ఉంచిన దివ్యాస్త్రాలవంటివే అని చెప్పక్కతప్పదు.
రాజకీయాల కోసం ఎప్పుడు ఏ కేసు ముందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో ఎవరూ చెప్పలేరు. కానీ సినిమా ప్రేక్షకులు కధని ఊహించిన్నట్లే, రాజకీయ పరిస్థితులను బట్టి కేసుల తీరుతెన్నులు ఏవిదంగా ఉండబోతున్నాయో ఊహించి చెప్పవచ్చు.
బిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి పక్కలో బల్లెం అవుతారని కేసీఆర్ ఎప్పుడో పసిగట్టారు. కనుక ఓటుకి నోటు కేసులో ఆయనని బిగించేయాలని ప్రయత్నించారు. కానీ పనిలోపనిగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కూడా వేసేయాలని దురాశకు పోవడంతో ఆ కేసుకి బ్రేకులు పడ్డాయి. ఆ కధ, దాని తర్వాత జరిగిన కధలు అందరికీ తెలుసు. కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.
కేసీఆర్ భయపడిన్నట్లే రేవంత్ రెడ్డి కారణంగా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కేసీఆర్ అధికారం కోల్పోయారు.
కనుక ఓటుకి నోటు కేసుతోనే సిఎం రేవంత్ రెడ్డిని మళ్ళీ రాజకీయంగా దెబ్బ తీయాలనుకున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేత ఆ కేసు విచారణని హైదరాబాద్ నుంచి (బీజేపీ అధికారంలో ఉన్న)మధ్యప్రదేశ్‌కి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ఓ పిటిషన్ వేయించారు.
కానీ ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. దానిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. కానీ ఈ కేసు విచారణ జరుపుతున్న ఏసీబీని ఆ కేసు గురించి నేరుగా సిఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ కేసులో జోక్యం చేసుకోవద్దని సిఎం రేవంత్ రెడ్డిని ఆదేశించింది అంతే!
ఆంటే ఈ పిటిషన్‌తో ఏదో జరుగుతుందని కేసీఆర్ అనుకుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లయింది. పైగా రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడానికి కేసీఆర్ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారనే విషయం బయటపడింది కనుక ఆయన కూడా కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలని దెబ్బ తీసేందుకు ప్రయత్నించకమానరు. అంటే కేసీఆర్ కోరుండి కొత్త సమస్యలని కొని తెచ్చుకున్నారన్న మాట!