ఏడుకొండలవాడా.... ఏమిటయ్యా ఈ కల్తీ రాజకీయాలు!

September 20, 2024


img

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కోట్లాది మందికి ఆరాధ్యదైవం. స్వామివారి దర్శనం కోసం రాష్ట్రపతి, ప్రధానులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదలు సామాన్య ప్రజలు వరకు తరలివస్తుంటారు. 

ఆపద మొక్కులవాడిని దర్శించుకుంటే సకల కష్టాలు, పాపాలు హరించుకుపోతాయని నిత్యం వేలాదిమంది భక్తులు ఏడుకొండలు కాలినడకన ఎక్కుతుంటారు. స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఆయన దర్శనం, ప్రసాదం లభించవని నమ్మేవారు కోట్లమంది ఉన్నారు. ఇరుగుపొరుగులు ఎవరో తిరుపతి వెళ్ళి స్వామివారి ప్రసాదం తీసుకువస్తే మహాద్భాగ్యం అనుకుంటారు. 

కోట్లాదిమంది హిందువులకు పరమ పవిత్రమైన అటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో ఘోర అపచారం జరిగిందని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. తాము అధికారంలోకి రాగానే స్వామివారి లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు తగ్గిందని ఆరా తీసి, ప్రసాదాన్ని ల్యాబ్‌లో పరీక్షింపజేస్తే ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని కల్తీ చేసిన్నట్లు తేలిందంటూ సిఎం చంద్రబాబు నాయుడు బాంబు పేల్చారు. 

అది గుర్తించిన వెంటనే ఆ నెయ్యి వాడకం నిలిపివేశామని, ఆ నెయ్యిని సరఫరా చేస్తున్న సదరు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం తిరుమలలో ఇంత అపచారానికి పాల్పడుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 

దీనిపై వైసీపి కూడా ఘాటుగా స్పందించింది. టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడు చాలా నీచరాజకీయాలు చేస్తున్నారు. మనిషి అనేవాడు ఎవరూ తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఇటువంటి నీచమైన పనులు చేయడు. 

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు పనికి మాలిన రాజకీయాల కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తూ తిరుమల ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. మేము మా కుటుంబాలతో సహా స్వామివారి ఎదుట ప్రమాణాలు చేయడానికి సిద్దం. మరి చంద్రబాబు నాయుడు కూడా సిద్దమేనా? అని సవాలు విసిరారు.     

వారికి టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి బదులిస్తూ ల్యాబ్‌ రిపోర్టులు బయటపెట్టారు. తిరుమలకి ఆ నెయ్యి సరఫరా చేసే ఆల్ఫా అనే కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసుకొని దానిని నెయ్యిలో కలుపుతున్నట్లు తేలిందని చెప్పారు.

ప్రభుత్వం ఆ కంపెనీపై, టీటీడీ పాలక మండలిలో ఆ కల్తీ నెయ్యిని వాడేందుకు అనుమతించినవారందరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.


Related Post