జానీ మాస్టర్ వ్యవహారంలో టాలీవుడ్‌ స్పందన ఎలా ఉందంటే...

September 17, 2024


img

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ మైనర్ బాలిక (డ్యాన్సర్)పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె  ముందుగా ఫిలిమ్ ఛాంబర్‌ పెద్దలకే ఫిర్యాదు చేయడంతో ఆమెకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి, ఓ కమిటీ రహస్యంగా విచారణ జరుపుతోందని, నటి ఝాన్సీ  నేడు మీడియాకు వివరించారు. 

తమ కమిటీ ఇరువురి వాంగ్మూలాలు తీసుకొని, సాక్ష్యాధారాలు సేకరిస్తోందని చెప్పారు. అయితే ఇటువంటి విషయాలు, విచారణ గురించి బహిర్గతం చేస్తే బాధితురాలికి లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తీరని నష్టం జరుగుతుంది కనుక తాము ఆ వివరాలు బయటపెట్టలేదని ఝాన్సీ చెప్పారు. 

కానీ ఇప్పుడు బాధితురాలే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో విషయం బహిర్గతం అయ్యింది కనుక తాము కూడా ఈ వ్యవహారం అనుమానాలు, అపోహలు నివారించేందుకు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతున్నామని చెప్పారు. 

ఒకవేళ ఆ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయకపోయి ఉంటే ఫిలిమ్ ఛాంబర్ ఏమి చేసి ఉండేది?నిజాయితీగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేదా?అంటే కాదనే అనిపిస్తుంది.

ఎందువల్ల అంటే, ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన రాజ్‌తరుణ్‌-లావణ్య-మాల్యా మల్హోత్రాల వ్యవహారంలో ప్రేక్షకపాత్ర పోషించారు. నటి హేమ విషయంలో కూడా అలాగే వ్యవహరించారు. కనుక ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్ళకపోయి ఉంటే మెల్లగా అటకెక్కించేసేవారు. కానీ బయటకు పొక్కినందున ‘కర్ర విరగకుండా పాము చావకుండా’ అన్నట్లు మాట్లాడారని అనుకోవచ్చు.


Related Post