లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ మొన్న బెయిల్‌పై విడుదలయ్యారు. ఆదివారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఆయన సంచలన ప్రకటన చేశారు.
“నేను ఏ తప్పు చేయలేదని సుప్రీంకోర్టు నమ్మి నన్ను జైలు నుంచి విడుదల చేసింది. అయితే ప్రజలు కూడా నమ్మాలి. అందుకే నేను రెండు రోజులలో నా పదవికి రాజీనామా చేసి ప్రజల మద్యకు వెళ్తాను. నేను చక్కటి పాలన అందించానని, ఏ తప్పు చేయలేదని ప్రజలు కూడా నమ్మి మళ్ళీ మన పార్టీని గెలిపిస్తేనే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడిగా భావిస్తాను లేకుంటే లేదు. నాతో పాటు ఈకేసులో జైలుపాలైన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో మాట్లాడాను. ఆయన కూడా నా బాటలోనే నడుస్తానని చెప్పారు,” అని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.
“మీరు జైలుకి వెళ్ళిన్నప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు?” అని విలేఖరుల ప్రశ్నకి సమాధానం చెపుతూ, “నేను రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదు. అందుకే నా ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజీనామా చేయలేదు. ఇప్పుడు నా స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించి నేను ప్రజల వద్దకు వెళ్ళి వారి తీర్పు కోరుతాను,” అని అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు.