ప్రముఖ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆ వ్యాపారం మానేసి సొంత రాష్ట్రం బిహార్‌లో ‘జన సురాజ్’ అనే సొంత పార్టీ పెట్టుకొని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన నిన్న పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ, “బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అవసరమే లేదు. మద్యంపై నిషేదం ఉండటంతో రాష్ట్రంలో కల్తీమద్యం వ్యాపారం పెరిగిపోయింది. సామాన్య ప్రజలు కల్తీ మద్యం త్రాగి ప్రాణాలు కోల్పోతున్నారు. కనుక మేము అధికారంలోకి వస్తే, గంటలోగా రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తాము,” అని చెప్పారు.
మద్యం త్రాగడం హానికరమని చెప్పే ప్రభుత్వాలే అబ్కారీశాఖని ఏర్పాటు చేసుకొని దానికో మంత్రిని కూడా నియమిస్తుంటాయి. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుంది కనుక దానిని పెంచేందుకు తోడ్పడేది ప్రభుత్వమే మళ్ళీ అక్రమ మద్యం అంటూ మద్యం బాటిళ్ళను రోడ్ రోలర్‌తో తొక్కించేది ప్రభుత్వమే. కానీ మద్యపానం విషయంలో ప్రశాంత్ కిషోర్ చాలా నిజాయితీగా తమ పార్టీ విధానాన్ని ప్రకటించడం విశేషం.