బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి, బిఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు, కేసులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ, ”తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. నిజమే! రాష్ట్రంలో పరిస్థితులు నాటి ఎమర్జన్సీనాటి పరిస్థితులను తలపించేవిదంగా ఉన్నాయిప్పుడు.
మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేస్తే ఇంతవరకు డిజిపి ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు?వారిపై ఫిర్యాదు చేయడానికి వెళితే తిరిగి మాపై కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ గూండాలు మాపై దాడులు చేస్తూనే ఉన్నారు.
రేవంత్ రెడ్డికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? కనుక రేవంత్ రెడ్డి ఆదేశం మేరకే ఈ దాడులు, అరెస్టులు జరుగుతున్నట్లు భావిస్తున్నాము.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదు?రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే రాహుల్ గాంధీ మాట్లాడరా? ఆయనకు బాధ్యత లేదా?
కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఎంతగా వేదించినా భయపడబోము. ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాము. తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము,” అని హరీష్ రావు అన్నారు.
ఆనాడు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలను ఇదే విదంగా గృహ నిర్బంధాలు చేసేవారు. ఈ వేధింపులు భరించలేక కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్‌లో, ప్రొఫెసర్ కోదండరామ్ తన ఇంట్లో తలుపులు వేసుకొని నిరాహార దీక్ష చేసుకుంటున్నా పోలీసులు తలుపులు పగలుగొట్టి వారిని అరెస్ట్ చేసేవారు.
గత ఎన్నికలలో కీలకమైన సమయంలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని గృహనిర్బందించడం, కూతురు పెళ్ళి చేసుకోనీయకుండా జైలుకి తరలించడం వంటివన్నీ బిఆర్ఎస్ నేతలు మరిచిపోయిన్నట్లున్నారు. వారు మరిచిపోయినా ఆ చేదు అనుభవలను కాంగ్రెస్ నేతలు ఎవరూ మరిచిపోలేరు. కనుక ‘రాజకీయ కర్మఫలం’ ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. కనుక గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకొని ప్రయోజనం ఉండదు.