కాంగ్రెస్, బిఆర్ఎస్ ఆధిపత్యపోరు... యాక్!

September 13, 2024


img

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అదనపు డీసీపీ రవిచందన్‌తో నిన్న వాగ్వాదానికి దిగినప్పుడు ఆయనను బెదిరించి తోసేశారు. కనుక ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై సెక్షన్స్ 132,351(3) కింద కేసు నమోదు చేశారు. 

నేడు శేరిలింగంపల్లి (బిఆర్ఎస్) ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు పార్టీ నియోజకవర్గం సమావేశం నిర్వహిస్తానని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కేసు నమోదు చేసినందున పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

కానీ ఆయన ఈ విషయం ముందే పసిగట్టడంతో నిన్న అర్దరాత్రి తన నివాసం నుంచి వెళ్ళిపోయారు. నేడు గాంధీ ఇంటి వద్ద జరిగే బిఆర్ఎస్ పార్టీ సమావేశానికి తప్పక వస్తానని చెప్పారు కనుక అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. 

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడంతో ఈ గొడవ మొదలైంది. 

ఎమ్మెల్యే గాంధీ అనుచరులు నగరంలో భారీ కాన్వాయ్‌తో బలప్రదర్శన చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి బయలుదేరడం చూసి సామాన్య ప్రజలు సైతం గాంధీ తీరుని తప్పు పడుతున్నారు. 

అయితే ఇంతకాలం ఎమ్మెల్యే గాంధీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆయన ఆంధ్రావాడనుకోలేదు. కానీ పార్టీ మారగానే ఆయన ఆంధ్రావాడని ఆక్షేపిస్తుండటం కూడా తప్పే. 

ఎన్నికలలో ఓడిపోయి కోలుకోలేకపోతున్న బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన మనుగడ కోసం ఆంధ్రా, తెలంగాణ ద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 

కనుక రెండు పార్టీలు తప్పు చేసినట్లు అర్దమవుతోంది. కనుక ఇకనైనా వెనక్కు తగ్గితే మంచిది. లేకుంటే ప్రజలు క్షమించరు.


Related Post