జూ.ఎన్టీఆర్‌ కూడా చిచ్చు రగిలించారుగా!

September 12, 2024


img

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా దేవర సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది. దేవర ట్రైలర్‌ అద్భుతంగా ఉండటంతో దేవరపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జూ.ఎన్టీఆర్‌ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, కొరటాల ఓ అద్బుతమైన దర్శకుడని పొగుడుతూ, “ఆయనకు సరైన మనుషులు, సరైన స్పేస్ లభిస్తే అద్భుతమైన సినిమాలు అందిస్తారని” అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ భగ్గు మంటున్నారు. 

చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరు మెగా హీరోలతో కొరటాల ఆచార్య తీస్తే అది బోర్లా పడింది. ఆచార్యకు మళ్ళీ ఇప్పుడు పోస్ట్ మార్టం అవసరం లేదు. కానీ జూ.ఎన్టీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో “అయితే చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరూ సరైనవారు కారని జూ.ఎన్టీఆర్‌ భావిస్తున్నారా?వారిరువురూ ఆచార్యలో కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని జూ.ఎన్టీఆర్‌ చెపుతున్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. 

అంతేకాదు ఆచార్యలో పలు సీన్స్ దేవరలో కూడా కనిపిస్తున్నాయంటూ రెండు సినిమాలలో కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆచార్య ఫెయిల్ అయినప్పుడు మరి దానిలో సీన్స్ ఎందుకు కాపీ కొట్టి వాడుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటి వరకు అల్లు అర్జున్‌తో మెగా అభిమానులు యుద్ధాలు చేశారు. ఇప్పుడు వారు జూ.ఎన్టీఆర్‌పై కత్తులు దూస్తున్నారు. కనుక ఈ యుద్ధం ఇంకా ముదరబెట్టకుండా జూ.ఎన్టీఆర్‌ వివరణ ఇస్తే దేవరకి మంచిది లేకుంటే మెగాభిమానులు దేవర బోటుని ఒడ్డుకి చేరనీయకపోవచ్చు.       


Related Post