నాడు తమ ఎమ్మెల్యేలని బిఆర్ఎస్‌లోకి తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పినప్పుడు, అప్పుడు సిఎంగా ఉన్న కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ, “మీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి మా పార్టీలో చేరుతున్నారంటే అది మీ సమస్య. మీ పార్టీ నాయకత్వ సమస్య. మా సమస్య కానేకాదు. మీలో మీకు గొడవలుంటే మీరే వాటిని పరిష్కరించుకోవాలి తప్ప మేమేమి చేయగలం?” అంటూ వ్యంగ్యంగా అన్నారు.
ఆనాడు శాసనసభలో కేసీఆర్ అన్న మాటలనే నేడు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తిరిగి బిఆర్ఎస్‌కి అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యేని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమించడంతో బిఆర్ఎస్ భగ్గుమంది. ఆనవాయితీ ప్రకారం ఆ పదవి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి. కానీ పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారు? అంటూ బిఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
వాటికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పిన జవాబు బిఆర్ఎస్‌కి కనువిప్పు కలిగించగలిగితే మంచిదే. “అరికెపూడి గాంధీ తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యేననే చెప్పుకున్నారు. ఆయనతో మీకు విభేధాలు ఉంటే అది మీ సమస్య. రాజ్యాంగం ప్రకారమే ఆయనకు ఆ పదవి ఇచ్చాము.
ఎమ్మెల్యేల అనర్హత గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన్నట్లుంది. మీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుంటే అది మీ పార్టీ, మీ నాయకత్వం సమస్య. మాది కాదు. అయినా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినా మీకు ఇంకా బుద్ది రాలేదు,” అని ఎద్దేవా చేశారు.