కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తిపై నాలుగు వారాలలో శాసనసభ కార్యదర్శి కార్యాచరణ రూపొందించాలని లేకుంటే తామే కలుగజేసుకోవలసి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.
ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ, “ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. కనుక బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటి నుంచే వాటికి సిద్దంగా ఉండాలి,” అని అన్నారు.
అయితే స్పీకర్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థలు, పార్లమెంట్, శాసనసభలు రాజ్యాంగబద్దంగా ఏర్పడిన రెండు వేర్వేరు వ్యవస్థలు. ఒకదాని వ్యవహారంలో మరొకటి జోక్యం చేసుకోలేవు. కానీ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వెళ్ళడం వలన పార్టీకి లాభం కలుగుతుందనుకుంటే, వెంటనే స్పీకర్ చేత విచారణ జరిపించి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయవచ్చు. వద్దనుకుంటే ఎన్ని నెలలు అయినా పక్కన పెట్టేయగలరు.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఓడిపోయి ఆత్మ స్థైర్యం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ, ఒకవేళ ఉప ఎన్నికల కోసం పగటి కలలు కంటున్నట్లే భావించవచ్చు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం మానేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు మరింత బలపడ్డాయి. కనుక ఉప ఎన్నికలు వచ్చి బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఓడిపోతే దాని మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది.