మందమర్రివాసుల కష్టాలు ఇంకెన్నేళ్ళు?

September 06, 2024


img

రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఏదైనా చిన్న సమస్య వస్తే హుటాహుటిన సరిచేస్తుంటారు కానీ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజల కష్టాలను పట్టించుకునేవారే లేరు.

మంచిర్యాల జిల్లాలో మందమర్రి, కాశిపేట మండలంలోని మామిడిగూడ, పెద్ద ధర్మారం, గోండుగూడెం, కొమ్ముగూడెం, అశోక్ నగర్‌ గ్రామాలలో నివశిస్తున్న ప్రజలకు  పెద్దవాగు దాటితే గానీ 14 కిమీ దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి చేరుకోలేరు.

రోజువారీ కూలిపనులు చేసుకునేవారు, చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునేవారు ప్రతీరోజూ పెద్దవాగు దాటి జిల్లా కేంద్రం చేరుకోవలసిందే. 

అయితే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్: 1 రాష్ట్రంగా నిలిపామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్‌ హయాంలో కూడా పెద్దవాగుపై వంతెన నిర్మించలేదు. కనుక గ్రామస్తులు ప్రతీరోజూ వాగుపై ఉన్న సింగిల్ ట్రాక్ రైల్వే ట్రాక్ మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 100 మీటర్లు పొడవున్న ఆ రైలు మార్గంలో గ్రామస్తులు ద్విచక్ర వాహనాలపై కూడా ప్రయాణిస్తుంటారు. 

ఆ సమయంలో ఎదురుగా లేదా వెనుక నుంచి గూడ్సు రైలు వస్తే తప్పించుకునే అవకాశం ఉండదు. వాగులో దూకితే ప్రవాహంలో కొట్టుకుపోతారు. రైలు పట్టాలపై ఉంటే రైలు కింద పడి చనిపోతారు. ఇంతవరకు ఆ విదంగా 17 మంది చనిపోయారని స్థానికులు చెపుతున్నారు. కనుక ఇప్పటికైనా పెద్దవాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

         



Related Post